బాబూ, వెనక్కి పోవద్దు: వైయస్
హైదరాబాద్: 1978 నుంచి తమ ఇద్దరి ఆస్తులపై ఏ విచారణకైనా సిద్ధమని చేసిన ప్రకటన నుంచి వెనక్కి పోవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి సూచించారు. తమ ఆస్తులపై ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించిన చంద్రబాబు తనపై అనవసరమైన ప్రకటనలు చేస్తున్నారని, తాను రిటైర్డ్ జడ్జిలను వేసుకుని తనకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకుంటానని చంద్రబాబు విమర్శ చేస్తున్నారని, చంద్రబాబు తన హయాంలో 15 విచారణల కమీషన్లకు రిటైర్డ్ వారినే వేశారని, చంద్రబాబు తనకు అనుకూలమైనవారిని వేసుకుని అనుకూలమైన నివేదికలు తెప్పించుకున్నారని అనుకోవచ్చు కదా అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జాతీయ ప్రయోజనాలున్న అంశాల విషయంలో తప్ప మిగతా అంశాలకు సంబంధించిన కమీషన్లకు సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని తీర్పు చెప్పిందని, తానైతే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నానని, అది సుప్రీంకోర్టు తీర్పు వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు.
మధ్యంతర ఎన్నికలు వస్తాయని భావించి ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియక చంద్రబాబు తనపై బురద జల్లే కార్యక్రమాన్ని మొదలు పెట్టారని, బట్ట కాల్సి మీదేస్తున్నారని, దాన్ని తుడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి అంటున్నారని, తాము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి అనడం రాజకీయాలను భ్రష్టు పట్టించమేనని ఆయన అన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో లక్ష్మణ రేఖ దాటారని, నోటికి ఏది వస్తే అడి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తన తండ్రి తాపీమేస్త్రీయో కాదో రికార్డులు చూస్తే స్పష్టమవుతుందని, దానికి విచారణలేం అక్కర లేదని ఆయన అన్నారు. తమ తండ్రి భూస్వామి అనే విషయం అందరికీ తెలుసునని ఆయన చెప్పారు. స్పష్టత లేకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగుదేశం నాయకులు అంటున్నారని ఆయన అన్నారు.
బురద జల్లే కార్యక్రమం చంద్రబాబుకు కొత్త కాదని, అది చంద్రబాబు స్వభావమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత మనుషులనే వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. తన ఏళ్ల పాలనలో వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని దెబ్బ తీశారని, దీంతో ప్రజలు చంద్రబాబును ఓడించారని, సత్యాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం తన మీద, తన కుటుంబం మీద బురదజల్లి కాంగ్రెసును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నదని, చంద్రబాబు ఆరోపణలను పిచ్చివాడి ప్రేలాపన కింద జమ కట్టవచ్చునని, కానీ తాను విచారణకు సిద్ధపడ్డానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications