బాబాయి మాటలు నమ్ముతున్నా: శ్రీజ
న్యూఢిల్లీ: తన బాబాయి పవన్ కళ్యాణ్ మాటలు నమ్ముతున్నానని, త్వరలోనే హైదరాబాదుకు వస్తామని మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెప్పారు. ఏ విధమైన హాని తలపెట్టబోమని తన తండ్రి చిరంజీవి చేసిన ప్రకటన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన శ్రీజ దంపతులు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించారు. శ్రీజ దంపతులు ప్రస్తుతం న్యాయవాది పింకీ ఆనంద్ సంరక్షణలోనే ఉన్నారు. వారు హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న వెంటనే తాము నార్త్ జోన్ డిసిపి వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని లేఖ సమర్పించామని, అయితే పోలీసులు స్పందించలేదని శ్రీజ దంపతులు తమ పిటిషనులో తెలిపారు. దాంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని, తాము గోవాకు వచ్చి, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నామని వారు చెప్పారు.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లు తనపై హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషనులో కేసు ఉండడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా శిరీష్ భరద్యాజ్ మండిపడ్డారు. తనపై కేసు నమోదైన మాట వాస్తవమేనని, అయితే ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు. ఆ రోజు తాము సినిమాకు వెళ్లామే తప్ప మైనర్ బాలికను కిడ్నాప్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 2002లో నమోదైన కేసును తిరగదోడడానికి పలుకుబడి, మీడియానే కారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
