ప్రధాని తీరుపై చంద్రబాబు ఆక్షేపణ
న్యూఢిల్లీ: రైతు సమస్యలను వివరించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు సమయం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ప్రతిపక్ష నాయకుడికి ప్రధాని సమయం ఇవ్వకపోవడం సముచితం కాదని ఆయన బుధవారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరికి మద్దతు ధరపై దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తామని, ఇందులో భాగంగా తృతీయ ఫ్రంట్ ఆధ్వర్యంలో విజయవాడలో సభ జరుగుతుందని ఆయన చెప్పారు.
యుపిఎ విధానాల వల్ల ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఎగుమతులపై నిషేధం సరి కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ పై ప్రధాన ఎన్నికల కమీషనరుకు ఫిర్యాదు చేశామని, దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని కోరామని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై పార్లమెంటులో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
