రైతు సంఘాల రైల్ రోకోలు: ఆందోళనకారుల అరెస్టులు
హైదరాబాద్: వరికి వేయి రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకార్యక్రమానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం ఉదయం తెలుగుదేశం, కమ్యూనిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు సికింద్రాబాదు రైల్వే స్టేషనులో ఢిల్లీకి వెళ్లే ఎపి ఎక్సుప్రెస్ రైలును నిలిపేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో ఎపి ఎక్సుప్రెస్ అరగంట ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడ కృష్ణా జంక్షనులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు రైళ్లను ఆపేశారు. అనంతరం విజయవాడ జంక్షనులో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్ జిల్లా ఖాజీపేటలో ఆందోళనకారులు రైల్ రోకో నిర్వహించారు. దీంతో శాతవాహన తదితర రైళ్లు ఆగిపోయాయి. నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆందోళనకారులు భాగ్యనగర్ ఎక్సుప్రెసును ఆపేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో రాయలసీమ ఎక్సుప్రెసును నిలిపేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రాఫికును ఆపేశారు. గుంటూర జిల్లా నడికూడ స్టేషనులో ఆందోళనకారులు రైల్ రోకో నిర్వహించారు. దీంతో శబరి, తదితర రైళ్లు ఆగిపోయాయి.












Click it and Unblock the Notifications
