రెండో ఎస్సార్సీ వైపే సోనియా మొగ్గు: మొయిలీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రెండో ఎస్సార్సీ వైపే మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీ వీరప్పమొయిలీ అన్నారు. రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆయన బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లేక్ వ్యూ అతిథి గృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధిష్ఠానం రెండో ఎస్సార్సీకి హామీ ఇచ్చిందని, ఈ విషయం రాజ్యాంగబద్దమైందని, ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీగా నియమితులైన తర్వాత ఆయన రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో పెద్ద యెత్తున స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన లేక్ వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై నిరంతర పోరాటం చేస్తున్న హైదరాబాద్ బ్రదర్స్ పి. జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి ఆయనను కలుసుకున్నారు. తాము మొయిలీని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నామని హైదరాబాద్ బ్రదర్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications
