పేలుళ్ల సూత్రధారి బిలాల్ బతికే ఉన్నాడు
హైదరాబాద్: హైదరాబాదులోని గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి షాహిద్ బిలాల్ జీవించే ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు నమ్ముతున్నాయి. దీనికి సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. పాకిస్థానులోని కరాచీలో బిలాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు సెప్టెంబరు నెలలో వార్తలు వచ్చాయి. హైదరాబాదులోని జంట పేలుళ్లతోనే కాకుండా సమఝౌతా ఎక్సుప్రెస్ పేలుడుతో, అజ్మీర్ దాడితో, హైదరాబాదులోని మక్కా మసీదు పేలుడుతో బిలాల్ కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
బిలాల్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పాకిస్తాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐయస్ ఐ ప్రచారం చేసిందని, భారతదేశంలోని దర్యాప్తు సంస్థలను పక్క దారి పట్టించేందుకే అలా ప్రచారం చేసిందని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. బిలాల్ పాకిస్థాన్ సరిహద్దులో గల సాయిల్కోటలో కనిపించినట్లు చెబుతున్నారు. బిలాల్ హర్కత్ - ఉల్ - జిహాదీ కమాండరుగా వ్యవహరిస్తున్నాడు. బిలాల్ తన స్థావరాన్ని కరాచీ నుంచి సాయిల్కోటకు మార్చినట్లు భావిస్తున్నారు. ఇటీవలి లూథియానా పేలుళ్లతో కూడా బిలాల్ కు సంబంధం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన బిలాల్ బంగ్లాదేశ్ కు పారిపోయాడు. అక్కడి నుంచే తన తీవ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్నాడు. హైదరాబాదు జంట పేలుళ్ల తర్వాత అతను పాకిస్థానుకు పారిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications