వైయస్ మీద మొయిలీ ప్రశంసల జల్లు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ ప్రశంసల జల్లుతో ముంచెత్తారు. రాజశేఖర రెడ్డి పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీభవనులో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రణాళిక అమలు కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆర్థిక ప్రణాళికతో పని చేస్తోందని ఆయన కొనియాడారు. ఇందిరమ్మ, ఆరోగ్య శ్రీ పథకాలను ఆయన పొగిడారు. రాష్ట్రంలో పేదలకు నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
హామీల అమలులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బేషుగ్గా పనిచేస్తోందని ఆయన చెప్పారు. నీటి పారుదల రంగంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆయన అన్నారు. పార్టీ పని తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అసమ్మతి లేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ బ్రదర్స్ పి.జనార్దన్ రెడ్డికి, మర్రి శశిధర్ రెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీసుల గురించి తెలుసుకున్నానని, ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన అన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాథూర్, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
