రోజా, నాయనిల మధ్య మాటల యుద్ధం
హైదరాబాద్: తెలుగు మహిళ అధ్యక్షురాలు, సనీనటి రోజాకు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డికి మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. బెల్టు షాపులపై, నాటు సారాపై హైదరాబాదులోని బషిర్ బాగులో గల ప్రెస్ క్లబ్బులో అఖిల పక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి తెలుగు దేశం తరఫున రోజా, తెరాస తరఫున నాయని నర్సింహా రెడ్డి హాజరయ్యారు.
సమావేశంలో మాట్లాడుతూ రోజా - తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేశారు. దానికి తీవ్రంగా ఆగ్రహం చెందిన నాయని నర్సింహారెడ్డి తీవ్ర స్వరంతో రోజాపై విమర్శలకు దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ ప్రారంభించారు.
మందు తాగి తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు పొద్దున 12 గంటల వరకు లేవరని రోజా వ్యాఖ్యానించారు. దీంతో తెరాస కార్యకర్తలు ఆగ్రహించి రోజాను ఘెరావ్ చేశారు. నాయని నర్సింహారెడ్డి ఆగ్రహంతో రోజాతో వాగ్వివాదానికి దిగారు. రోజా వ్యాఖ్యకు నిరసనగా తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోజా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోజా క్షమాపణ చెప్పాల్సిందేనని వారు పట్టుబట్టారు. అందుకు రోజా తిరస్కరించారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రోజాను తెలంగాణనుంచి తరిమి కొడ్తామని తెరాస మహిళా విభాగం కార్యదర్శి కె. సులోచన హెచ్చరించారు. తమ నేతపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని నాయని నర్సింహారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications
