అదే తీరు: అసెంబ్లీ సోమవారానికి వాయిదా
హైదరాబాద్: కార్యక్రమాలేవీ చేపట్టకుండానే శాసనసభ బుధవారం సోమవారానికి వాయిదా పడింది. వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రతిపాదించిన ప్రతిపక్షాలు వాటిపై తక్షణ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అయితే ఆ వాయిదా తీర్మానాలను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు. అయినా ప్రతిపక్షాలు వినకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూకు, ఆయన అనుచరులకు హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని విలువైన భూములను కట్టబెట్టడంపై తక్షణ చర్చకు తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు నోడల్ వ్యవస్థపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తక్షణ చర్చకు పట్టుబట్టారు.
తమ డిమాండ్లతో తెరాస సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. దాంతో సభను స్పీకర్ తొలుత అర గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి పావుగంట పాటు వాయిదా వేశారు. మూడోసారి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు తమ డిమాండ్లతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
