నెహ్రూకు కాదు, వైయస్ కు సంబంధించింది: దత్తాత్రేయ
ఏలూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ భూముల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ భూగరిష్ట పరిమితికి సంబంధించిన పత్రాలన్నింటిపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భూగరిష్ట పరిమితి చట్టం దుర్వినియోగానికి సంబంధించి ఆరోపణలున్నాయని, న్యాయవిచారణ జరిపిస్తే మంత్రులు, శాసనసభ్యులు బయటకు వస్తారని ఆయన అన్నారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్ భూములకు సంబంధించిన వ్యవహారం దేవినేని నెహ్రూకు సంబంధించింది మాత్రమే కాదని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిందని ఆయన అన్నారు. పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం అంశాన్ని మంత్రి డి. శ్రీనివాస్ నుంచి, ఆ తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు నుంచి ముఖ్యమంత్రి ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. వరికి మద్దతు ధరను డిమాండు చేస్తూ తమ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఈ నెల 27వ తేదీ నుచి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
