కర్ణాటక సియంగా యెడ్యూరప్ప ప్రమాణ స్వీకారం
బెంగూళూర్:దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటయింది. బీజేపీ నేతృత్వంలో కర్ణాటకలో ఏర్పాటయిన సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా మాజీ ఉప ముఖ్యమంత్రి యోడ్యూరప్ప సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 65 ఏళ్ల యెడ్యూరప్ప దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తరపున తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు. నలుగురు బీజేపీ సభ్యులు వీఎస్ ఆచార్య, గోవింద్ కార్జోల్, ఆర్ అశోక్, జగ్‌దీష్ షెట్టర్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకుముందు సోమవారం ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయనతో పాటు మరో నలుగురు మంత్రులు చేత కూడా కర్నాటక గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల చేపట్టబోతున్న జేడీఎస్ చీఫ్ దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆ పార్టీకి చెందిన మిగతా 17 మంది మంత్రులు ఈ నెల 18 లేదా 19న ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. వీరి ప్రమాణస్వీకారం తరువాత జరగడానికి గల కారణాలేవీ జేడీఎస్ వెల్లడించలేదు. ఆదివారం సమావేశమయిన జేడీఎస్ శాసనసభా పక్ష నేతలు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా, జేడీఎస్ శాసనసభా పక్ష నేతగా కుమరస్వామిని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని శనివారం వరకు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications
