తెలంగాణ వైయస్ పరిధిలో లేదు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి హోదా అడ్డు కాదని రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డు పడుతున్నారనే మాటల్లో నిజం లేదని, ఒక వేళ అడ్డు పడేవారే అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చినప్పుడే వ్యతిరేకించి ఉండేవారని, అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఉన్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారని అనుకోనని ఆయన అన్నారు.
తెలంగాణపై తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పలుసార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అంశం ఎఐసిసి పరిధిలో ఉందని, ముఖ్యమంత్రి పరిధిలో లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశం పరిష్కారం ముఖ్యమంత్రి పరిధిలో లేదని, ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
