నాన్నగారు ఎలా చనిపోయారంటే.. రఘుబాబు ఎమోషనల్ వీడియో..
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు(80) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మృతికి గల కారణాలను కుమారుడు, ప్రముఖ నటుడు రఘుబాబు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం గిరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అల్జీమర్స్, శ్వాసకోశ సంబంధిత సమస్యలున్నాయని పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని.. అయితే రేపు మధ్యాహ్నం స్వగ్రామం రావినూతలలో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇక గిరిబాబు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600 లకు పైగా చిత్రాల్లో నటించి.. విలన్ గా, హాస్యనటుడిగా.. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. ఈ మేరకు గిరిబాబు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.

అలాగే గిరిబాబు మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో కలచివేసిందని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వీరితోపాటు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు గిరిబాబు మృతిపట్ల మా అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. గిరిబాబు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఇవాళ రాత్రి 7 నుంచి 9 వరకు ఫిల్మ్‌ఛాంబర్ లో గిరిబాబు భౌతికకాయం ఉంటుందని వెల్లడించింది. ఇక గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన 1946లో ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. తన సుదీర్ఘమైన సినీ కెరీర్ లో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
