రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాను: లగడపాటి
హైదరాబాద్: తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తెలంగాణలో ఎంతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా సెంటిమెంటు బలంగా ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలోనే ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు రెండో ఎస్సార్సీ వేయాలనేది తమ పార్టీ పంథా అని, అదే విషయాన్ని తాము తెలంగాణ విషయంలో ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని, దానికి తామందరం కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు. ఎస్సార్సీ లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా గమ్యాన్ని చేరడానికి పలు మార్గాలుంటాయని, ఆ మార్గాల గురించి మాట్లాడుతున్నారని, అయితే పార్టీ పంథా మాత్రం రెండో ఎస్సార్సీ అని, వేరే మార్గంలో తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటే పార్టీ పంథా మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు రెండో ఎస్సార్సీకి తాము అంగీకరించిన తర్వాత ఒకరు వ్యతిరేకం, మరొకరు అనుకూలం అని చెప్పడానికి వీలు లేదని ఆయన అన్నారు. ఎస్సార్సీకి అంగీకరించిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని విభజనలు చేయాలనేది ఎస్సార్సీ ద్వారా నిర్ణయించాలనేది పార్టీ వైఖరని, పాలనాసౌలభ్యం కోసం విభజనకు అంగీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఒక జాతీయ విధానం ఉండాలనే ఉద్దేశంతో ఎస్సార్సీని తన వైఖరిగా నిర్ణయించుకున్నామని ఆయన వివరించారు. ఎస్సార్సీ అనేది పార్టీ పంథా కాబట్టి దాన్ని వ్యతిరేకించే వారి విషయంలో పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై తమ హామీని అమలు చేయడానికి ఇంకా ఏడాదిన్నర కాలం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
