జైపాల్ రెడ్డివి ఉత్తుత్తి కబుర్లే: రావుల
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి కబుర్లు చెబుతున్నారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ - హైదరాబాద్ రహదారిపై తాను వేసిన ప్రశ్నకు రాతపూర్వకమైన సమాధానం వచ్చిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ రహదారికి 13000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధమని, గత మూడేళ్లలో 16 కోట్ల 92 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చామని ప్రభుత్వం చెప్పిందని ఆయన అన్నారు. రాష్ట్రానికి జాతీయ రహదారుల కోసం రావాల్సిన నిధులు తమిళనాడుకు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రానికి చెందిన 8 మంది కేంద్ర మంత్రులు గానీ, అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు గానీ జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. జైపాల్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టి మాయచేసే ప్రయత్నం చేస్తున్నారని, లెక్కల గారడీ చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి పనికి రాని మంత్రులుగా కేంద్ర మంత్రులు మిగిలిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
