విలేకరులపై కేసులు ఎత్తేస్తాం: ముఖ్యమంత్రి
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో అరెస్టయిన ఇద్దరు జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ గృహాల్లో అవకతవకలు జరిగాయని వార్త రాసిన ఈ ఇద్దరు విలేకరులు అధికారినుంచి ఖాళీ పత్రాలు తీసుకుని తమకు ఇష్టమైన పేర్లు కాసి మోసం చేశారనే ఆరోపణపై కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన గురువారం శాసనసభలో చెప్పారు. విలేకరులపై తమకు ఏ విధమైన కక్షా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ విలేకరులు పత్రాలు తీసుకుని పేర్లు నింపారు గానీ వార్త వారే రాశారో లేదో తేలలేదని, ఈ విషయంపై దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. తప్పు చేసినప్పుడు తిరిగి తప్పు చేయకుండా తగిన విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని, అయితే ఆ తప్పులను సమర్థిస్తే మరింత పెద్ద తప్పులు చేస్తారని ఆయన అన్నారు. వారిపై కేసులు ఎత్తేయాలంటే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. విలేకరుల అరెస్టు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపియం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
