రామోజీ ఫిల్మ్ సిటీకి గోల్డెన్ పోనీ అవార్డు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పోనీ అవార్డు లభించింది. ఇటలీ చెందిన గేమ్స్ అండ్ పార్క్స్ ఇండస్ట్రీ ఈ అవార్డును నెలకొల్పింది. టూరిజం రంగంలో వ్యక్తులు, సంస్థలు చేసే కృషికిగానూ ఈ అవార్డును అందజేస్తారు. ప్రపంచంలో పేరుగాంచిన పలు థీమ్ పార్కులు ఈ అవార్డు కోసం పోటీ పడినప్పటికీ రామోజీ ఫిల్మ్ సిటీ ఆ అవార్డును గెలుచుకుంది. ఆసియా నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి సంస్థగా రామోజీ ఫిల్మ్ సిటీ మరో ఘనతను సాధించింది. ఫన్, ఎంటర్ టెయిన్మెంట్, రిలాక్సేషన్, మేజిక్ తదితర మరిన్ని విభాగాలలో రామోజీ ఫిల్మ్ సిటీ అగ్రస్థానంలో నిలిచింది. ఇటలీలోని జెనోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ వైస్-ప్రసిడెంట్ రాజీవ్ జల్నాపుర్కార్ ఇటీవల ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తమ సేవలను మరింత పెంచేలా చేసిందని అవార్డు అందుకున్న రాజీవ్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఆసియాలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపిందని అన్నాడు. అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ఫిల్మ్ సిటీ అతిథులు మరిచిపోలేని అనుభవాలను అందిస్తోందని ఆయన అన్నారు. 1,666 ఎకరాల విస్తృతితో చక్కని సెట్స్ తో చూడచక్కని అనుభవాన్ని టూరిస్టులకు ఇస్తోందని ఆయన అన్నారు. మనిషి రూపొందించిన అద్భుతాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతి సంవత్సరం ఒక మిలియన్ టూరిస్టులను ఆకర్షిస్తోంది. హాలీవుడ్ నిర్మాతలు సైతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications
