మొద్దు శీనుకు ఏడేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని చందానగర్ బాంబు పేలుడు కేసులో జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను నేరం రుజువైంది. దీంతో మొద్దు శీనుకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరు నెలలు కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మొద్దు శీనును పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలోని చందానగర్ లోని సుప్రజా లాడ్జిలో బాంబు తయారు చేస్తుండగా మొద్దు శీను పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటికే అతను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో పోలీసులకు పట్టుబడకుండా అతను పారిపోయి ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో మకాం పెట్టాడు.
అయితే గుంటూరులోని ఒక భూవివాదంలో న్యాయవాది వెంకటేష్ గౌడ్ ను హత్య చేయడానికి మొద్దు శీను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి కొన్ని రోజులు కూకట్ పల్లిలోనూ, ఆ తర్వాత చందానగర్ లోనూ ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఇదే సమయంలో సుప్రజా లాడ్జిలో బాంబు తయారు చేస్తుండగా మొద్దు శీను చేతిలోనే అది పేలింది. తీవ్రంగా గాయపడి అతను పోలీసుల చేతికి చిక్కాడు. మొదట పోలీసులు అతన్ని గుర్తించలేదు. మీడియా గుర్తించిన తర్వాత వారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications
