వికలాంగుల ధర్నా: చర్చలు విఫలం
హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వికలాంగులు సోమవారం నిర్వహించిన మహాగర్జన ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన గర్జన అనంతరం వికలాంగులు బాబూ జగజీవన్ రాం విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఇక్కడి నుంచి కదలబోమని హెచ్చిరించారు. పోలీసులు తమను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. కిరోసిన్ సీసాలను చేతుల్లో పట్టుకొని ఆ హెచ్చరికలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమవారం రాత్రి నుంచి వారు అక్కడే ఉన్నారు.
సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రభుత్వానికి మరో 24 గంటల గడువు విధించింది. అఖిల పక్ష కమిటీని వేసి తమ సమస్యలను పరిష్కరించాలని సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసింది. మంత్రులు ఎన్. రాజ్యలక్ష్మి, ముఖేష్ మంగళవారం ఉదయం రెండు విడతలు మందకృష్ణతో చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి రాజ్యలక్ష్మి విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని సమితి అధ్యక్షుడు వీరయ్య అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో జరిపిన చర్చల వివరాలను వివరించడానికి రాజ్యలక్ష్మి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సమావేశమయ్యారు. వికలాంగుల ధర్నాపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications
