ప్రభుత్వం లేఖ: వికలాంగుల ధర్నా విరమణ
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ధర్నాను వికలాంగులు మంగళవారంనాడు విరమించారు. సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 2వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి అంగీకరించడంతో వారు ధర్నాను విరమించారు. సోమవారం జరిగిన మహాగర్జన అనంతరం వికలాంగులు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా ధర్నాను విరమించబోమని మొండికేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి అఖిల పక్ష సమావేశం నిర్వహించడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవాధ్యక్షుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగకు లేఖ వచ్చింది.
అరవై యేళ్ల స్వతంత్ర భారతదేశంలో వికలాంగుల సమస్యలపై అఖిలపక్షం వేయడం ఇదే తొలిసారి అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. అంతకు ముందు సిపిఐ, బిజెపి నాయకులు వికలాంగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. జనార్దన్ రెడ్డి కూడా దీక్షా శిబిరానికి వచ్చి మందకృష్ణతో మాట్లాడారు. మంత్రులు రాజ్యలక్ష్మి, ముఖేష్ రెండు విడతలు మందకృష్ణతో చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications
