సూరీడికి కోటి ఇచ్చాం: సుబ్రహ్మణ్యం
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి సూరీడుకు కోటి రూపాయలు ఇచ్చామని డిపెప్ కుంభకోణంలో నిందితుడు సుబ్రహ్మణ్యం చెప్పారు. తాను, సరసాదేవి ఇద్దరం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆ మొత్తాన్ని సూరీడికి అందజేశామని ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మొత్తాన్ని ఇచ్చే సమయంలో తాను, సరసాదేవి, సూరీడు మాత్రమే ఉన్నామని, అంతకు మించి రుజువులు లేవని, తాను సిఐడికి ఇదే విషయం చెప్పానని ఆయన చెప్పారు. తాము అక్రమంగా డబ్బులు డ్రా చేసుకుంటున్నామని సరసాదేవి సూరీడుకి చెప్పిందని, అందుకే సూరీడు కోటి రూపాయలు అడిగారని, లేకుంటే అడిగి ఉండేవారు కాదని ఆయన అన్నారు. తనను బలి పశువును చేశారని ఆయన అన్నారు.
సరసాదేవి చెప్పేవన్నీ అబద్ధాలేనని సుబ్రహ్మణ్యం అన్నారు. రాజకీయ నేపధ్యం ఉందని అక్రమాలకు తలొగ్గానని, లేకుంటే జీతంతో తాను హాయిగా ఉన్నానని, తనను రక్షిస్తానని సరసాదేవి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. కోర్టు అనుమతి మేరకు తన అస్తులు జప్తు చేస్తారని, దీంట్లో తాను చేయాల్సిందేమీ లేదని ఆయన అన్నారు. సూరీడు, సరసాదేవిల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి సరసాదేవే కుంభకోణాన్ని నడిపించిందని ఆయన ఆరోపించారు. లేకుంటే తాను ఇందులో ఇరుక్కుని ఉండేవాడిని కాదని ఆయన అన్నారు. అయితే సరసాదేవి సుబ్రహ్మణ్యం ఆరోపణలను ఖండిస్తున్నారు. తన నుంచి సుబ్రహ్మణ్యంకు ఎలాంటి ప్రాణహాని లేదని ఆమె అన్నారు. సుబ్రహ్మణ్యంకు స్వప్న అనే రెండో భార్య ఉందని, ఆమె కుటుంబ సభ్యుల నుంచే సుబ్రహ్మణ్యంకు ప్రాణహాని ఉందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
