EPF Withdrawal: పీఎఫ్ విత్ డ్రాకు తాజా రూల్స్- కొత్తగా 3 విభాగాలు- ఎన్నిసార్లంటే.?
దేశవ్యాప్తంగా ఉద్యోగులు ప్రతీ నెలా దాచుకునే తమ భవిష్యనిధి డబ్బుల్ని అవసరం వచ్చినప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు (EPF Withdrawal) ప్రస్తుతం ఉన్న నిబంధనల్ని సరళీకరిస్తూ భవిష్య నిధి సంస్థ (EPFO) తాజా నిబంధనల్ని విడుదల చేసింది. దీని ప్రకారం గతంతో పోలిస్తే ఎన్ని సార్లయినా పీఎఫ్ డబ్బుల్ని పాక్షికంగా వెనక్కి తీసుకునేందుకు అవకాశం లభించింది. అలాగే గతంలో ఉన్న విభాగాల్ని మూడుకు తగ్గించింది. దీంతో ఈ నిబంధనల్ని సులభంగా అర్దం చేసుకునేందుకు వీలు కలిగింది.
సవరించిన ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పీఎఫ్ అడ్వాన్స్ ను మూడు వర్గాలుగా విభజించారు. ఇందులో అత్యవసర అవసరాలు, గృహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. ఈ నిబంధనలు అనారోగ్యం, విద్య, వివాహం, గృహవసతి వంటి ఖర్చులను కవర్ చేస్తాయి. అనారోగ్యం కోసం తీసుకునే ఈపీఎఫ్ అడ్వాన్స్‌పై మాత్రం ఎలాంటి పరిమితి లేదు. అత్యవసరాల విభాగం కింద, సభ్యులు తమ చికిత్స కోసం లేదా అర్హులైన కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అనారోగ్య కారణంతో ఒక సభ్యుడు ఎన్నిసార్లు అయినా అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు, దీనిపై నిర్దిష్ట పరిమితి ఏదీ లేదు.

విద్య కోసం పీఎఫ్ సభ్యుడు తన జీవిత కాలంలో 10 సార్లు అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ కోసం లేదా అర్హులైన కుటుంబ సభ్యుల విద్యా సంబంధిత ఖర్చుల కోసం కూడా అడ్వాన్స్‌ను వాడుకోవచ్చు. పెళ్లికి సైతం ఐదు సార్లు వరకు అడ్వాన్స్ తీసుకునే వీలు కల్పించారు. పెళ్లి అనేది అత్యవసరాల విభాగం కిందకు వచ్చే మరో ఖర్చుగా వర్గీకరించారు. సభ్యులు తమ సభ్యత్వ కాలంలో వివాహ సంబంధిత ఖర్చుల కోసం ఐదు సార్లు వరకు ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఈ నిబంధన సభ్యునికి , అర్హులైన కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. అలాగే ఇందులో రెండవ వర్గం గృహ సంబంధిత అవసరాలకు కేటాయించారు. ఫ్లాట్ లేదా స్థలం కొనడం, ఇల్లు కట్టుకోవడం, గృహ రుణం తిరిగి చెల్లించడం, పునరుద్ధరణ, మార్పులు లేదా మెరుగుదల పనులు చేపట్టడం వంటి ప్రయోజనాల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్‌ను వాడుకోవచ్చు. ఇలా జీవిత కాలంలో ఐదుసార్లు తీసుకోవచ్చు. ఇక ప్రత్యేక పరిస్ధితుల కేటగిరీలో రెండుసార్లు అడ్వాన్స్ తీసుకోవచ్చు. అలాగే సభ్యులు ఉద్యోగి, యజమాని వాటాలతో సహా తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతం ఉంచుకోవాల్సి ఉంటుంది.














Click it and Unblock the Notifications
