జూ. డాక్టర్ల ఆందోళన: మంత్రుల చర్చలు విఫలం
హైదరాబాద్: హైదరాబాదులోని నీలోఫర్ పిల్లల ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగడంతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. వైద్య సేవలు అందక ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డట్లు సమాచారం. చికిత్స నిమిత్తం తీసుకువచ్చిన పసికందును నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఆసిఫ్ నగర్ మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ తన అనుచరులతో వచ్చి ఆదివారం సాయంత్రం నీలోఫర్ ఆస్పత్రి వైద్యులతో అనుచితంగా ప్రవర్తించారు. దీన్ని నిరసిస్తూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. అఫ్సర్ ఖాన్ ను సస్పెండ్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, ముఖేష్ సోమవారం ఉదయం మూడు విడతలుగా చర్చలు జరిపారు. వారి చర్చలు ఫలించలేదు. తమకు రక్షణ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించబోమని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. నీలోఫర్ ఆస్పత్రిలో వైద్య సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చంద్రవదన్ చెప్పారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల నుంచి వైద్యులను రప్పించనున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ డాక్టర్ల ఆందోళనకు సీనియర్ డాక్టర్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వారికి మద్దతుగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications
