వైద్యులపై దాడి సరి కాదు: వైయస్
నిజామాబాద్/ హైదరాబాద్: నీలోఫర్ వైద్యులపై దాడి సరైంది కాదని, బాధ్యులపై చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం నిజామాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. వైద్యులపై చేయి చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. వైద్యులు ఎక్కడైనా సరిగా వైద్యం అందించకపోతే ఫిర్యాదులు చేయవచ్చునని, న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు. నీలోఫర్ సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు.
తాము చెప్పాల్సిందంతా చెప్పామని, ఇక జూనియర్ డాక్టర్ల ఇష్టమని ఆరోగ్య మంత్రి గల్లా అరుణ కుమారి అన్నారు. సంఘటనపై సిఐడి విచారణ జరిపిస్తామని, సంఘటన జరిగినప్పుడు ప్రతిస్పందించని ఎస్సైని సస్పెండు చేస్తామని ఆమె చెప్పారు. వైద్యం అందక ఎవరూ చనిపోలేదని ఆమె అన్నారు. గల్లా అరుణకుమారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చంద్రవదన్, వైద్యాధికారులు జూనియర్ డాక్టర్లు నాలుగో విడత చర్చలు జరిపారు. అయితే జూనియర్ డాక్టర్లు తమ పట్టు వీడడం లేదు.












Click it and Unblock the Notifications
