తెరాస సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సస్పెన్షన్ ను ఎత్తేశారు. తెరాస సభ్యులు సభకు హాజరు కావడానికి ఆమోదం తెలిపారు. అంతుకు ముందు సభా కార్యక్రమాలను సజావు నడవనిస్తామని హామీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులపై సస్పెన్షన్ ఎత్తి వేయడానికి తాము సిద్ధమేనని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య చెప్పారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు ఆయన గురువారం శాసనసభలో ఆ విషయం చెప్పారు. ప్రతిపక్షాలను బయటకు పంపి సభను నడపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అయితే సమస్యలపై చర్చ జరగాలని ఆయన అన్నారు. రోశయ్య వివరణ ఇచ్చిన తర్వాత శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
అంతకు ముందు తెరాస సభ్యుల సస్పెన్షన్ అనంతరం ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు తెరాసకు అవకాశం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి కోరారు. తెలంగాణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం తెరాస సభ్యులు శాసనసభ ఆవరణలో ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications
