న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ: టీమిండియాతో మొదటి వన్డే నుంచి స్టార్ బ్యాటర్ అవుట్
భారత్‌తో అయిదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆక్లాండ్ ఈడెన్ పార్క్ లో ప్రాక్టీస్ సెషన్ సమయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయపడ్డాడు. అతని తలకు గాయమైంది. ఈ హఠాత్ పరిణామంతో టీమిండియాతో బుధవారం జరిగే మొదటి వన్డేకు దూరం అయ్యాడు. ఈ పరిణామం న్యూజిలాండ్ టీమ్ మేనేజ్మెంట్ ను ఆందోళనకు గురిచేసింది. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా ఖరారు కాలేదు.. గానీ టిమ్ సీఫెర్ట్ పూర్తిస్థాయిలో జట్టుకు అందుబాటులోకి రావొచ్చు.
నెట్స్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీని డెవాన్ కాన్వే ఢీకొట్టాడు. క్యాచ్ పట్టే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాల్లోకి ఎగిరిన బంతిని అందుకోవడానికి ఇద్దరూ ఒకేసారి ప్రయత్నించారు. తల పైకెత్తి బంతినే చూస్తూ ఎదురెదురుగా వచ్చారు. అదుపు తప్పి ఒకరినొకరు ఢీ కొట్టారు. డెవాన్ కాన్వే తల నేరుగా హెన్రీని తాకింది. వెంటనే తల పట్టుకుని కింద కూర్చండిపోయాడు కాన్వే. అటు హెన్రీకి కూడా దెబ్బ బలంగా తాకింది.

దీని తీవ్రత అధికంగా ఉండటంతో ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మ్యాట్ హెన్రీకి కాంకషన్ పరీక్షలు నిర్వహించారు. అతను క్షేమంగానే ఉన్నాడని తేలింది. కాన్వే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటోన్నాడని కేప్టెన్ మిఛెల్ శాంట్నర్ చెప్పాడు. అతనికి విశ్రాంతి అవసరమని, అందుకే బుధవారం జరిగే మొదటి వన్డేకు అందుబాటులో ఉండట్లేదని పేర్కొన్నాడు.
భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌ను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొడ కండరాల గాయంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మార్క్ చాప్‌మాన్, భుజం గాయంతో ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యారు. ఇప్పుడు ఓపెనర్ కాన్వే కూడా గాయపడటంతో కివీస్ బ్యాటింగ్ లైనప్ బలహీనపడినట్టయింది. ఈ పరిణామాల నేపథ్యంలో వికెట్ కీపర్ బ్యాటర్ టీమ్ సీఫెర్ట్‌ను పూర్తి సిరీస్ కోసం జట్టులో కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించింది. కాన్వే స్థానంలో సీఫెర్ట్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇటీవలే ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలుచుకుని టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు అద్భుత రీతిలో పుంజుకుని చివరి రెండు టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆ వరుస విజయాలు అందించిన ఆత్మవిశ్వాసంతోనే వన్డే సిరీస్‌ను ప్రారంభించాలని భావించిన న్యూజిలాండ్‌కు, కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం సవాల్ గా పరిణమించింది.














Click it and Unblock the Notifications
