రాప్తాడు బాలిక లక్ష్మి పేరు జాతీయ సాహస అవార్డుకు సిఫార్సు.. పుట్టెడుకష్టాల్లో లక్ష్మి కుటుంబం!
అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన ఘోర ఘటనలో తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన బాలికపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. క్లాస్ రూమ్ లో టీచర్ ఉండగానే నేరుగా వచ్చి బాలికపై దాడి చేసిన క్రమంలో ఉన్మాది హేమంత్ ను లక్ష్మి ధైర్యంగా ఎదుర్కొంది. తను గాయపడుతున్నా సరే శివంగిలా ఉన్మాదిని నిలువరించే ప్రయత్నం చేసింది లక్ష్మి.
దీంతో లక్ష్మి ధైర్యం అందరినీ కదిలించింది. ఆమె పేరును జాతీయ సాహస బాలిక అవార్డుకు సిఫార్సు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాహస బాలిక అయిన ఆమె కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సాహస బాలిక అవార్డుకే కాదు పుట్టెడు కష్టాల్లో ఉన్న లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం సాయం చెయ్యాలని కూడా స్థానికుల నుండి డిమాండ్ వినిపిస్తుంది.

లక్ష్మీ కుటుంబం పేదరికంతో రోజువారీ జీవితం కూడా కష్టంగా సాగుతోంది. లక్ష్మి కుటుంబం చాలా సాధారణమైనది. తల్లి రమాదేవి ప్రైవేట్ కాలేజీలో స్వీపర్‌గా పని చేస్తుంది. తండ్రి నాగరాజు భవన నిర్మాణ కార్మికుడు. వీరికి నలుగురు పిల్లలు. లక్ష్మి పెద్ద కూతురు. తర్వాత యామిని, వర్షిణి, వినోద్ ఉన్నారు. వర్షిణికి వైకల్యం ఉంది. నానమ్మ అంజినమ్మ కాళ్లు చచ్చుపడి మంచానికే పరిమితమయ్యారు.
ఇంట్లో ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు కూడా పాడైపోయి ఉండలేని స్థితిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం నేషనల్ బ్రేవరీ అవార్డ్ కు సిఫార్సు చేయటం మాత్రమే కాదు, లక్ష్మి కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది..
మంత్రి నారా లోకేష్ లక్ష్మి ధైర్యాన్ని ప్రశంసించారు. "స్నేహితురాలిని కాపాడేందుకు భయపడకుండా లక్ష్మి ముందడుగు వేసింది. ఇది నిజమైన స్నేహానికి నిదర్శనం అన్నారు. ఆమెకు ఉత్తమ వైద్యం అందిస్తాం. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది" అని చెప్పారు. అవార్డు రావడం మంచిదే కానీ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా, సోదరికి పింఛన్ వంటి సహాయం అందితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ప్రమాద సమయంలో కూడా స్నేహం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన చిన్నారి ధైర్యం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. టీచర్ దగ్గరకు వెళ్ళటానికి కూడా సాహసం చెయ్యని చోట ఒక చిన్నారి చేసిన సాహసం అందరి మన్ననలు పొందుతోంది. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ స్కూల్‌కు వెళ్లాలని అందరూ ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications
