అంబటి రాంబాబుకు ఈడీ సమన్లు- రేపే విచారణకు
ఏపీ మద్యం విధానంలో చోటుచేసుకున్నట్లుగా చెబుతోన్న అక్రమాల కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం నాడు నిర్వహించబోయే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మద్యం కొనుగోళ్లు, విక్రయాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు చెబుతున్నారు.
గత వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మద్యం విధానంపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. డిజిటల్ చెల్లింపుల విధానంలో కాకుండా నగదు రూపంలోనే భారీగా మద్యం విక్రయాలు జరిపారన్న అంశంపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాయి. నిర్దుష్ట మద్యం బ్రాండ్లకే అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, అక్రమ మార్గాల్లో నిధుల తరలింపు జరిగిందనే ఆరోపణల కోణంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విస్తృత సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాల్లో లభించిన పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఆ తనిఖీల్లో లభ్యమైన సమాచారం, డిజిటల్ ఆధారాల బట్టి గత ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించిన పలువురికి నోటీసులు జారీ చేస్తూ వచ్చారు.
ఈ కేసులో గతంలో పలు అరెస్టులు సైతం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కే ధనంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్టు చేసింది. అనంతరం వారంతా కూడా బెయిల్ పై విడుదల అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డిపైనా మద్యం కేసు ఆరోపణలు ఉన్నాయి.
అంబటి రాంబాబును విచారించడం ద్వారా నాటి విధానపరమైన నిర్ణయాలు, నిధుల సేకరణ పద్ధతులపై స్పష్టత వస్తుందని ఈడీ అధికారులు భావిస్తోన్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన నగదు మళ్లింపు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు ఎవరెవరి ఖాతాల ద్వారా సాగాయి, అక్రమ నిధులు ఎక్కడెక్కడ డిపాజిట్ అయ్యాయనే అంశాలపై ఈడీ ప్రత్యేక ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఈ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సమన్లు జారీ చేయడం ఏపీ రాజకీయాలో ప్రాధాన్యత సంతరించుకుంది. అంబటి రాంబాబు విచారణ ముగిసిన తర్వాత వెలుగులోకి వచ్చే విషయాలపై ఉత్కంఠత నెలకొంది. రానున్న రోజుల్లో ఈ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదు. దీంతో తదుపరి చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమౌతోంది.














Click it and Unblock the Notifications
