కాంగ్రెసుకు నాలుగు ముఖాలు: నోముల
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసుకు నాలుగు ముఖాలున్నాయని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య విమర్శించారు. కాంగ్రెసు నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారం శాసనసభలో అన్నారు. తెలంగాణ వెనకబాటుకు కాంగ్రెసే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ చేసిన 610 జీవో అమలులో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.
అధికారం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కాంగ్రెస్ గత ఎన్నికల్లో జత కట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా ఏర్పడిన తెరాసతో ఎందుకు కలిసినట్లు అని ఆయన అడిగారు. అమ్మ సోనియాగాంధీ తెలంగాణ ఇస్తుందని తెరాసవారు భ్రమపడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ వారు భ్రమ పెడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుకు తెలంగాణపై ప్రత్యేక ఆలోచన లేదా, స్పష్టత లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికే ఈ తతంగమంతా నడిపారని ఆయన కాంగ్రెసు వారిని విమర్శించారు. తాము భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నామని, వారి కోసమో వీరి కోసమో తమ వైఖరిని మార్చుకోమని ఆయన అన్నారు. తెలంగాణ భారాన్ని సోనియాపై మోపడంలో కాంగ్రెస్ ఆంతర్యమేమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
