వైయస్, చంద్రబాబుల వాగ్వివాదం
హైదరాబాద్: విజయవాడలో విద్యార్థిని అయేషా హత్య కేసుపై శుక్రవారం శాసనసభలో దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. అయేషా హత్య కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను కలిసినప్పుడు జరిగిందేదో జరిగింది, నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, అందుకు తాను నిరాకరించానని, దోషులను పట్టుకోవాలని అడిగానని అయేషా తల్లి చెప్పిందని, అదే విషయాన్ని తాను మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పానని చంద్రబాబు వివరించారు. కావాలంటే మీడియా క్లిప్పింగ్స్ తెప్పించుకుని చూడవచ్చునని ఆయన అన్నారు. అయేషా హత్య కేసును సిబిఐకి అప్పగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.
సిబిఐని కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా దాని ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బ తీసిందని చంద్రబాబు అన్నారు. సిబిఐకి అప్పగించడానికి అయేషా తల్లి అంగీకరించకపోవడం విచారకరమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అయేషా మృతదేహం వద్ద రాసిపెట్టిన లేఖ దస్తూరీ అయేషా మేనమామ రాతతో సరిపోలుతున్నదని, చేతి రాతను పరీక్షలకు పంపితే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఆయన అన్నారు. అయేషా తల్లితో కలిసి తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా బహిరంగ సభ పెట్టడమెందుకని ఆయన అడిగారు. అయేషా హత్య కేసులో పలు వర్గాల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
