నేనెందుకు రాజీనామా చేయాలి?: దామోదర్
హైదరాబాద్: తెలంగాణ వాదాన్ని వినిపించిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిపై రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రాజీనామా చేయాలనే పురుషోత్తమరెడ్డి సవాల్ ను స్వీకరించడానికి ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నిరాకరించారు. తానెందుకు రాజీనామా చేయాలని ఆయన అడిగారు. పార్టీ అధిష్ఠానవర్గం ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. పురుషోత్తమ రెడ్డి తనను రాజీనామా చేయాలని అడగడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తన సత్తా పురుషోత్తమ రెడ్డికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.
తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నంత కాలం పురుషోత్తమ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించారని, తెలంగాణను రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని అన్నారని, మంత్రి పదవి రాదని తెలిసి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీలోనే చర్చించాలని, బహిరంగంగా మాట్లాడితే పార్టీ నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సీనియర్లు భువనగిరి సభను రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
