లెప్ట్ పాదయాత్ర: నేతల అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంపై బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ సిపియం, సిపిఐ, న్యూడెమొక్రసీ కార్యకర్తలు మంగళవారం తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, శాసనసభా పక్ష నాయకుడు నోముల నరసింహయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, శాసనసభ్యులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా వామపక్షాల కార్యకర్తలు నారాయణగుడా ఫ్లై ఓవర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత శాసనసభ్యులను శాసనసభ వరకు నల్లజెండాలతో పాదయాత్రకు పోలీసులు అనుమతించారు. రాఘవులును బొల్లారం పోలీసు స్టేషన్ కు, నారాయణను గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడాన్ని రాఘవులు ఖండించారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంపై దాడి మతశక్తుల పనేనని ఆయన విమర్శించారు.
సుందరయ్య విజ్ఞానకేంద్రంపై దాడి శాసనసభలోనూ ప్రకంపనలు సృష్టించింది. దాడిపై చర్చించాలంటూ వామపక్షాలు వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. దాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే చర్చ జరగాలంటూ వామపక్షాల సభ్యులు పట్టుపట్టారు. ఆ సంఘటనపై తాను ప్రకటన చేస్తానని హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. ఎప్పుడు ప్రకటన చేస్తారంటూ వామపక్షాల శాసనసభ్యులు ప్రశ్నించారు. ఈ రోజు గానీ రేపు గానీ చేస్తానని మంత్రి చెప్పారు. అయితే వామపక్షాల సభ్యులు శాంతించలేదు. ఈ రోజే ప్రకటన చేస్తానని మంత్రి చెప్పడంతో వామపక్షాల సభ్యులు శాంతించారు.












Click it and Unblock the Notifications
