ఎల్లంపల్లిపై దద్ధరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టు పనుల్లో అవకతవకల ఆరోపణలపై మంగళవారం శాసనసభ దద్ధరిల్లింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లోకాయుక్త నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శాసనసభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి పోడియం చుట్టుముట్టారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులను స్పీకర్ ఒక రోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ అనంతరం తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభ నుంచి లోకాయుక్త కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అంతకు ముందు శాసనసభలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై బిజెపి సభ్యుడు జి. కిషన్ రెడ్డి వేసిన ప్రశ్నకు మంత్రి డి. శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే నివేదికను తొక్కిపెడుతోందని తెలుగుదేశం పార్టీ సభ్యులు విమర్శించారు. సభ సద్దమణగకపోవడంతో తెలుగుదేశం సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
