లాహోర్లో పేలుళ్లు: 20 మంది మృతి
లాహోర్: పాకిస్తాన్ లోని లాహోర్ నగరం మంగళవారం రెండు వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఈ పేలుళ్లలో ఇద్దరు బాలలతో సహా సుమారు 20 మంది దాకా మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు. నగరంలోని మాల్ రోడ్డులో ఉన్న పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాంతీయ కార్యాలయం వద్ద మొదటి బాంబు పేలుడు సంభవించగా, భుట్టో కుటుంబ నివాసం బిలావల్ హౌస్కు అతి సమీపంలో ఉన్న మెడల్ టౌన్ ప్రాంతంలో రెండో బాంబు పేలింది.
మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆరు అంతస్తుల ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కార్యాలయం పార్కింగ్ ప్రదేశంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థులు ఎక్కువమంది గాయపడ్డారు. భవనం బాగా దెబ్బతినడంతోపాటు మంటలు వ్యాపించాయి. పేలుడు సంభవించిన ఎఫ్ఐఏ భవనంలో 200- 300 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. పేలుడు తీవ్రతతో భవనంలో చాలా భాగం కూలింది. భవనం వెలుపలివైపు రెండు బాంబు పేలుళ్లు సంభవించాయని ఎఫ్ఐఏ ఉద్యోగి ఒకరు చెప్పారు. సాధారణంగా ఎఫ్ఐఏ భవనం ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, పేలుడు జరిగిన సమయంలో కూడా రోడ్డుపై అనేక మంది ఉన్నట్లు పాక్కు చెందిన డాన్ టీవీ పేర్కొంది.












Click it and Unblock the Notifications
