చిరంజీవి పార్టీ పెడ్తారనలేదు: కోటగిరి
రాజమండ్రి: మెగాస్టార్ చిరంజీవి పెట్టే పార్టీలో చేరుతానా, లేదా అనేది చెప్పడం కుదరదని, అలా చెప్పడం ఊహాగానమే అవుతుందని, ఊహాగానాలు చేయడం సరి కాదని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు అన్నారు. చిరంజీవి పార్టీ పెడితే ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని ఆయన గురువారం చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది. ఆయన గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు దూరంగా ఉంటున్నారు. ఆయన చిరంజీవి పార్టీలో చేరే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ పెడతారని ఊహించి చెప్పడం మహానుభావుడు చిరంజీవిని అవమానించడమే అవుతుందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి పార్టీ పెడతారని గానీ, తాను అందులో చేరే అవకాశం ఉందని గానీ తాను చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ ఉన్న వ్యక్తి అని, చంద్రబాబుకు రాజకీయానుభవం ఉందని, ఈ ఇద్దరి పార్టీలు కలిసి పనిచేస్తే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని మాత్రమే చెప్పానని ఆయన వివరించారు.
చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఏదైనా మాట్లాడితే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ నెల 18వ తేదీన చింతలపూడిలో పెట్టే సమావేశం అప్పుడప్పుడు జరిగేదే అని ఆయన అన్నారు. చింతలపూడి నియోజకవర్గం పెద్దలతో ఒక సంఘం ఏర్పాటు చేశామని, ఏదైనా ఆ సంఘంతో చర్చించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత తాను ఆ పార్టీలో చేరతానా, లేదా అనేది చెప్పడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ప్రజల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గురించి మాట్లాడ్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
