తెలంగాణ ప్రతి ఎకరాకు నీరు: వైయస్
మహబూబ్ నగర్: తెలంగాణలో సేద్యానికి యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి నీరందిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సోమవారంనాడు శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసి) సొరంగమార్గం పనులను ప్రారంభించారు. గత నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చులో యాభై శాతం నిధులను తెలంగాణలోనే ఖర్చు చేశామని ఆయన చెప్పారు. ఎంతటి వ్యయప్రయాసలకైనా ఓర్చి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 160 టియంసిల నీటిని తెలంగాణలోని ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలకు వాడకంలోకి తెస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఎత్తిపోతలు, సొరంగమార్గాలు ఉంటాయని, తెలంగాణకు గోదావరి నీటిని అందించాలంటే 600 మీటర్ల మేరకు ఎత్తిపోయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దక్కన్ పీఠభూమికి నీరందించాలంటే ఎత్తిపోతలు తప్పవని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు, నల్లగొండ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరందుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications