చిక్కుల్లో తెరాస: 7 సీట్లకు పరిమితం
హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వ్యక్తమయ్యాయి. ఖైరతాబాద్, తెర్లాం శాసనసభా నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతా 16 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. గత నెల 29వ తేదీన ఈ స్థానాలకు పోలింగ్ జరగగా, ఆదివారంనాడు ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 18 స్థానాల్లో తెరాసకు 7 స్థానాలు, కాంగ్రెసుకు 6 స్థానాలు దక్కాయి. తెలుగుదేశం పార్టీకి ఐదు స్థానాలు వచ్చాయి. తెర్లాంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెంటు లక్ష్మునాయుడు గెలుపొందారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. మిగతా 16 స్థానాల్లో తెరాసకు 7, కాంగ్రెసుకు 5, టిడిపి 4 స్థానాలు వచ్చాయి. ఈ ఫలితాలు తెరాసకు దెబ్బనే.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శాసనసభా నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి ఎ. చంద్రశేఖర్ కు డిపాజిట్ గల్లంతయ్యింది. సిద్ధిపేటలో తప్ప తెరాస గెలిచిన మిగతా స్థానాల్లో కూడా పెద్దగా మెజారిటీ రాలేదు. సిద్ధిపేటలో తెరాస అభ్యర్థి హరీష్ రావు 30 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. దొమ్మాట (సోలిపేట రామలింగారెడ్డి), హుజూరాబాద్ (కెప్టెన్ లక్ష్మీకాంతరావు), కమలాపూర్ (ఈటెల రాజేందర్), మేడారం (కొప్పుల ఈశ్వర్), ఆలేరు (నగేష్), చేర్యాల (కె. ప్రతాపరెడ్డి) సీట్లను తెరాస గెలుచుకుంది. జడ్చర్ల (మల్లు రవి), ఖైరతాబాద్ (విష్ణు), ఎల్లారెడ్డి (జనార్దన్ గౌడ్), డిచ్ పల్లి (ఆకుల లలిత), ముషీరాబాద్ (మణెమ్మ), వికారాబాద్ (ప్రసాదరావు) సీట్లను కాంగ్రెసు గెలుచుకుంది. ముషీరాబాద్ లో విజయం కాంగ్రెస్, బిజెపిల మధ్య దోబూచులాడింది. చివరకు కాంగ్రెస్ విజయం సాధించింది. కాగా, తెలుగుదేశం పార్టీ తెర్లాం నియోజరవర్గాన్ని గెలుచుకోవడంతో పాటు స్టేషన్ ఘనపూర్ (కడియం శ్రీహరి), ఖానాపూర్ (సుమన్ రాథోడ్), రామాయంపేట (హనుమంతరావు), సికింద్రాబాద్ (తలసాని శ్రీనివాస యాదవ్) సీట్లలో విజయం సాధించింది.
ఈ ఉప ఎన్నికల్లో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు అత్యంత సన్నిహితులైనవారు ఓడిపోయారు. ఇది వ్యక్తిగతం కెసిఆర్ కు కూడా నష్టమే. విజయరామారావు, నాయని నర్సింహారెడ్డి, ఎ. చంద్రశేఖరరావు కెసిఆర్ కు అత్యంత సన్నిహితులు. అన్ని వేళలా వీరు కెసిఆర్ ను వెన్నంటి ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెండు శాసనసభా నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సొంత జిల్లా.












Click it and Unblock the Notifications