కెసిఆర్ రాజీనామా తిరస్కరణ
హైదరాబాద్: పార్టీ అధ్యక్ష పదవికి కె. చంద్రశేఖరరావు చేసిన రాజీనామాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాష్ట్ర కార్యవర్గం బుధవారం తిరస్కరించింది. ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెసిఆర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాను ఉపసంహరించుకోవడానికి ఆయన మంగళవారంనాడు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాపై చర్చించడానికి తెరాస కార్యవర్గం బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశానికి రావాలని కెసిఆర్ ను నాయకులు కోరారు. అయితే ఆయన సమావేశానికి రాలేదు.
సమావేశానికి హుజూరాబాద్ శాసనసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అధ్యక్షత వహించారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కెసిఆర్ ను కోరుతూ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కెసిఆర్ చేసిన కృషి అనన్యమైందని తీర్మానంలో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో కెసిఆర్ విజయమ సాధించారని అన్నారు. కెసిఆర్ చేత రాజీనామాను ఉపసంహరించజేసేందుకు తీర్మానం ప్రతితో ఒక ప్రతినిధి బృందం ఆయన ఇంటికి వెళ్లింది.












Click it and Unblock the Notifications