చిరంజీవి ప్రజాయాత్రల తర్వాతే పొత్తులు: మిత్రా

ప్రజారాజ్యం విధానాలు, వివిధ అంశాలపై సీపీఎం నాయకులతో మాట్లాడినట్లు తెలిపారు. ఎన్నికల పొత్తు గురించి ఎలాంటి ప్రస్తావనా రాలేదని పేర్కొన్నారు. తెరాసతో అధికారికంగా, అనధికారికంగా ఎలాంటి చర్చలూ జరగటం లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య, ప్రజాహిత, అభివృద్ధికాముక, లౌకిక భావాలు తమ పార్టీ ప్రాథమిక విధానమని, దీనికి అనుగుణంగా ఎవరితోనైనా మాట్లాడతామని వివరించారు.
తెదేపా ప్రతిపాదిస్తున్న మహాకూటమిలోకి ఆహ్వానిస్తే చేరతారా అని ప్రశ్నించగా.. అలాంటి ఆలోచనే లేదని బదులిచ్చారు. సొంత కూటమి కోసం ప్రయత్నిస్తున్నారా అని ప్రస్తావించగా... 'అందరికీ ఇతరులతో అవసరాలుంటాయి, రాజకీయంగా ప్రయాణిస్తుంటే కలిసే వారు ఉంటారు' అని బదులిచ్చారు. ఎన్నికలకు ముందుగా కీలక పొత్తులుంటాయని పేర్కొన్నారు. వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ... 'ప్రతి పార్టీకి వారి సొంత అజెండా ఉంటుంది. దానికి అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకుంటారు.
పొత్తులు పెట్టుకుంటారు. మనం పోయి మాట్లాడామని వారి విధానం మార్చుకోరు కదా! సీపీఎం నాయకులతో కలిసినప్పుడు తిరుపతి సభ జరిగిన తీరు, మా పార్టీ విధానాల గురించి వివరించాను. పొత్తుల ప్రస్తావన రాలేదు. వారు ఎవరితో కలవాలన్నది మేం చెప్పలేంకదా! భాజపా అగ్రనేత అద్వానీ ఫోన్ విషయం ప్రస్తావనకు రాలేదు. కేంద్రంలో రాజకీయ పరిణామాలు, పార్టీల మధ్య పొత్తులు తరచూ మారిపోతున్నాయి. ఏ పార్టీకీ దీనిపై స్పష్టత ఉండటం లేదు. కేంద్రంలో ఏం చేయాలన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటాం' అని వివరించారు.












Click it and Unblock the Notifications
