ఈ తల్లికి పెద్ద కొడుకును: అక్కినేని
హైదరాబాద్: తాను సినీ కళామతల్లికి ప్రస్తుతం పెద్ద కొడుకునని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. తన 85 జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం తనను పరామర్శించడానికి వచ్చిన వారితో ఆయన ఆ విధంగా అన్నారు. తాను ఒకప్పుడు సినీ కళామతల్లికి చిన్న కొడుకునని, ఇప్పుడు మాత్రం పెద్ద కొడుకునని ఆయన అన్నారు. అక్కినేని నాగేశ్వరరావును మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడు మురళీ మోహన్ తదితరులు ఆభినందించారు. అక్కినేని నాగేశ్వరరావు నిండా నూరేళ్లు జీవించాలని కోరుకున్నట్లు మురళీ మోహన్ అన్నారు. దీనికి అక్కినేని ప్రతిస్పందిస్తూ నూరేళ్లు బతకాల్సిన అవసరం లేదు గానీ ఉన్నన్ని రోజులు హాయిగా ఉండాలని అభినందించండని అన్నారు.
దేశం, ప్రపంచం గర్వించదగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగువాడు కావడం మనకు గర్వకారణమని మురళీమోహన్ అన్నారు. 1924లో కృష్ణా జిల్లా వెంకటరాఘవపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ పరిశ్రమలో ఆణిముత్యంగా నిలిచారు. దాదాసాహెబ్‌ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో శుక్రవారం ఉదయంనుంచి సందడి చోటుచేసుకుంది. పలువురు నటీనటులు, సినీరంగ ప్రముఖులు, ఆత్మీయులు ఆయనను స్వయంగా వచ్చి అభినందించారు. అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు, నమ్మినబంటు, ఆత్మబలం, ప్రేమనగర్, దసరా బుల్లోడు వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు.












Click it and Unblock the Notifications