షార్జాలో వంద మంది ఆంధ్రుల నిర్బంధం
హైదరాబాద్: దుబాయ్ లోని షార్జా విమానాశ్రయంలో దాదాపు వంద మంది ఆంధ్రులు చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వార్తాకథనాన్ని ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ సోమవారం ఉదయం ప్రసారం చేసింది. రెండు వారాలుగా వారు షార్జా విమానాశ్రయలో నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆహారం, మంచినీళ్లు కూడా దొరకడం లేదని బాధితులు ఫోనులో తమకు చెప్పినట్లు ఆ వార్తా చానెల్ తెలియజేసింది. సరైన పత్రాలు లేవంటూ వారిని షార్జాలో అధికారులు నిర్బంధించారు.
వారంతా గతంలో రాష్ట్ర మంత్రి షబ్బీర్ అలీ చొరవ మేరకు రాష్ట్రానికి దుబాయ్ నుంచి వచ్చినవారే కావడం విశేషం. సరైన పత్రాలు లేకపోవడంతో దుబాయ్ లో ఉంటున్న వారిని గతంలో షబ్బీర్ అలీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం దుబాయ్ ప్రభుత్వంతో చర్చించి వారు తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసింది. వారికి ఇక్కడ తగిన ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే వారికి ఉపాధి కల్పించకపోవడంతో వారు తిరిగి షార్జా వెళ్లారు. అయితే వారిని షార్జాలో అక్కడి అధికారులు నిర్బంధించారు.
ఒక్కసారి తిరిగి పంపేసిన తర్వాత తిరిగి లోనికి అనుమతించబోమని షార్జాలో అధికారులు వారిని అడ్డగించారు. వారిలో ఎక్కువ మంది కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందినవారే. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలకు చెందినవారు కూడా కొద్ది మంది ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications