ఖజానా చూస్తే ఖాళీగా ఉందనే డైలాగులు వద్దు- మిగులు బడ్జెట్ ఇచ్చాం: స్టాలిన్ హితవు
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీ జోసెఫ్ విజయ్ పేరుతో ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఏఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం కొలువుదీరింది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనపై పదునైన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకాలు చేసిన నిర్ణయాలను స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని మొదట్లోనే మాట్లాడొద్దని హితవు పలికారు. "ప్రభుత్వం వద్ద డబ్బు ఉంది. ప్రజలకు మంచి చేయడానికి చిత్తశుద్ధి, పాలనా సామర్థ్యం రెండూ కావాలి" అని స్టాలిన్ స్పష్టం చేశారు.

అయిదేళ్లుగా కోవిడ్, వరదలు వంటి అనేక సమస్యలతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షను ఎదుర్కొంటూనే తాము ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని స్టాలిన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల రుణాన్ని మిగిల్చి, ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిందని మొదటి ప్రసంగంలో ఆరోపించడం సరికాదని తేల్చి చెప్పారు. తమిళనాడు రుణ పరిమితి అనుమతించిన నిబంధనల లోపలనే ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గత ఫిబ్రవరి బడ్జెట్‌లోనే స్పష్టంగా వివరించామని పేర్కొన్నారు.
వాటి గురించి తెలిసుకున్న తర్వాతే ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని స్టాలిన్ ఎదురుదాడికి దిగారు. ఓటర్లను మరోసారి మోసం చేసి దారి మళ్ళించవద్దని హెచ్చరించారు. ఆచరణ సాధ్యమైన వాటిని మాత్రమే హామీలుగా ఇస్తున్నానని చెప్పి అధికారంలోకి వచ్చారని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలో తమ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. ఓటర్లతో పాటు తాను కూడా అదే నమ్ముతున్నానని, టీవీకే పాలనలో తమిళనాడు ప్రగతి కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేస్తోన్నానని స్టాలిన్ ట్వీట్ చేశారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு. @ActorVijay அவர்களுக்கு எனது மனப்பூர்வமான வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 10, 2026
பதவியேற்றதும் தாங்கள் கையெழுத்திட்டுள்ள அறிவிப்புகளையும் வரவேற்கிறேன்.
எடுத்த எடுப்பிலேயே அரசிடம் பணம் இல்லை…
రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి తెలియదా? అంతా తెలుసుకునే ప్రజలకు హామీలు ఇచ్చారు కదా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయొద్దని, నిధులు లేవంటూ సమస్యను దారి మళ్ళించడం ఎంత మాత్రం సహేతుకం కాదని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తానని, ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు వాటిని అమలు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications