అన్నాదురై టూ విజయ్.. ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి ఈమెనే ??
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ చారిత్రక తరుణంలో, వెండితెరపై ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న దిగ్గజ నటి మనోరమ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఏడుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఏకైక నటిగా .. 'ఆచి' మనోరమ రికార్డు సాధించింది. ఆమె కెరీర్‌లో ఉన్న ఈ అరుదైన ఘనత ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ముఖ్యమంత్రులతో అనుబంధం..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'ఆచి'గా పిలవబడే మనోరమ గారు దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అయితే ఆమె కెరీర్‌లో అంతకు మించిన గొప్ప విషయం ఏమిటంటే.. ఆమె ఏకంగా ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. ఇందులో తమిళనాడు రాజకీయాలను శాసించిన దిగ్గజాలతో పాటు, ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కూడా ఉండటం విశేషం.

విజయ్ నటించిన 'సెల్వ', 'తమిళన్', బ్లాక్ బస్టర్ మూవీ 'వేట్రైకారన్' వంటి సినిమాల్లో మనోరమ నటించారు. విజయ్ చిన్నతనం నుండి ఆయన ఎదుగుదలను చూసిన నటిగా, ఆమె ఎప్పుడూ ఆయన క్రమశిక్షణను పొగిడేవారు. నేడు విజయ్ ఈ స్థాయికి చేరుకోవడంపై ఆమె అభిమానులు "ఆచి బ్రతికి ఉంటే ఎంతో సంతోషించేవారు" అని గుర్తు చేసుకుంటున్నారు. మనోరమ గారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 1500 కంటే ఎక్కువ నాటకాలు, 1000 కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె నటనకు గానూ పద్మశ్రీ, జాతీయ ఉత్తమ సహాయ నటి పురస్కారం వంటి ఎన్నో గౌరవాలు దక్కాయి. 2015లో ఆమె కన్నుమూసినా, నేడు ఒక కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఆమె పేరు మళ్ళీ మారుమోగడం ఆమె గొప్పతనానికి నిదర్శనం.
ఎవరెవరితో నటించారంటే?
సి.ఎన్. అన్నాదురై: ఆయనతో కలిసి మనోరమ పలు నాటకాల్లో నటించారు.
ఎం. కరుణానిధి: ఆయన రాసిన నాటకాల్లో మరియు సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు.
ఎం.జి. రామచంద్రన్ (MGR): ఎంజీఆర్‌తో కలిసి ఆమె అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
జె. జయలలిత: జయలలిత గారితో మనోరమకు మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో వెండితెరను పంచుకున్నారు.
ఎన్.టి. రామారావు: తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం, మాజీ సీఎం ఎన్టీఆర్‌తో కలిసి ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు.
ఎం.కె. స్టాలిన్: తాజాగా బాధ్యతల నుంచి తప్పుకున్న స్టాలిన్ కూడా గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ఆయనతోనూ మనోరమ కలిసి నటించడం విశేషం.
దళపతి విజయ్: ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విజయ్‌తో కూడా మనోరమ నటించారు.












Click it and Unblock the Notifications