అర్ధరాత్రి పాకిస్థాన్‌లో ఉగ్ర దాడి.. 15 మంది పోలీసులు బలి!
పాకిస్తాన్‌లోని అస్థిర ప్రాంతాల్లో ఉగ్రవాదం మరోసారి పడగ విప్పింది. శనివారం రాత్రి బన్నూ నగరంలో జరిగిన భీకర ఆత్మాహుతి దాడి, ఆదివారం బలూచిస్తాన్‌లో జరిగిన వరుస దాడులతో పొరుగు దేశం రక్తసిక్తమైంది. ముఖ్యంగా బన్నూలో పోలీసులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడి ఆ దేశ భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని ఎండగడుతోంది.
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోని బన్నూ నగరం శనివారం రాత్రి పెను పేలుడుతో దద్దరిల్లింది. ఫతేఖేల్ పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఆత్మాహుతి దాడి తీవ్రతకు చెక్‌పోస్ట్ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది పోలీసు సిబ్బంది అక్కడికక్కడే మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి అనేక మంది అధికారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. డిఐజి సజ్జాద్ ఖాన్ పర్యవేక్షణలో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి.

సుదూర ప్రాంతాలకూ వినిపించిన పేలుడు శబ్దం
ఈ ఆత్మాహుతి దాడి ఎంత శక్తివంతమైనదంటే, పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీలు సైతం పగిలిపోయాయి. చీకటి సమయం కావడం, మళ్లీ ఉగ్రవాదులు మెరుపు దాడులు చేస్తారన్న భయాందోళనల మధ్య సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి ముగ్గురు పోలీసులను ప్రాణాలతో బయటకు తీయగలిగారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బలూచిస్తాన్‌లో 'బీఎల్ఎఫ్' మారణహోమం
ఒకవైపు బన్నూలో ఈ దారుణం జరుగుతుండగానే, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) ఆదివారం వరుస దాడులకు తెగబడింది. బలూచిస్తాన్‌లోని ఖరాన్, వాషుక్, మస్తుంగ్ సహా పది ప్రాంతాల్లో భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 10 మంది పాకిస్తానీ సైనికులు, నలుగురు రాష్ట్ర ఏజెంట్లు మరణించినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది. సైనిక స్థావరాలు, కాన్వాయ్‌లపై రాకెట్లు, గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డామని ఆ సంస్థ వెల్లడించింది.
రాకెట్ దాడులు.. పౌరులపై కాల్పులు!
మే 3న ఖరాన్ నగరంలోని ఎఫ్‌సీ చెక్‌పోస్ట్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు తెలిపిన బీఎల్ఎఫ్, తాజాగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిఘా కెమెరాలను ధ్వంసం చేశామని పేర్కొంది. ఉగ్రవాదుల దాడుల అనంతరం పాకిస్తానీ బలగాలు ఆవేశంతో సమీపంలోని పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, క్వాడ్‌కాప్టర్‌ల సాయంతో తమ యోధులను వెంబడించే ప్రయత్నం చేశారని బీఎల్ఎఫ్ ఆరోపించింది.
వరుస దాడులతో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాద ముప్పులతో ఆ దేశం అట్టుడుకుతోంది. ముఖ్యంగా పోలీసులను, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులు పాక్ అంతర్గత భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది ఈ దాడులను తీవ్రంగా ఖండించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉగ్రవాదుల అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications