చిరుతో నేరుగానే మాట్లాడ్తాం: కెటిఆర్
హైదరాబాద్: మాట్లాడదలుచుకుంటే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో తాము నేరుగానే మాట్లాడుతామని, అందుకు మధ్యవర్తులు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి కెటి రామారావు అన్నారు. తమ నేత కె. చంద్రశేఖరరావు సందేశాన్ని ప్రజా గాయకుడు గద్దర్ చిరంజీవికి చేర్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గద్దర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న యోధుడని, కెసిఆర్ ను కలిసిన తర్వాత చిరంజీవిని గద్దర్ కలవడం కాకతాళీయమేనని, తమ నేత తరఫున కలవలేదని ఆయన వివరణ ఇచ్చారు.
తెలంగాణలో ప్రజా అంకిత యాత్ర చేపట్టడానికి ముందే చిరంజీవి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. తెలంగాణపై చిరంజీవి నుంచి మరింత స్పష్టమైన ప్రకటనను వాంఛిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని పార్టీలను కోరినట్లుగానే చిరంజీవిని కూడా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
