చిరంజీవి చెప్తే నమ్మరు: పొన్నాలు
హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నిన్న రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు నమ్మబోరని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణపై చిరంజీవి కొత్తగా చెప్పిందేమీ లేదని, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని చిరంజీవి చెప్తున్నారని, ఈ విషయాన్ని తాము ఎన్నో ఏళ్లుగా చెబుతున్నామని ఆయన గురువారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, అందువల్ల చిరంజీవి మాటలను ప్రజలు నమ్మే అవకాశం లేదని ఆయన అన్నారు.
తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించిన వినతిపత్రంపై తన సంతకం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల లోగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం తెలంగాణ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుక్కుంటుందని ఆయన చెప్పారు. తాము పార్టీలోపల తెలంగాణపై మాట్లాడుతూనే ఉన్నామని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం బజారుకెక్కి మాట్లాడితేనే మాట్లాడినట్లు కాదని, తాము పార్టీలో మాట్లాడుతున్నామని, తెలంగాణ అంశం తమ పార్టీ అధిష్ఠానవర్గం పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై మాట్లాడుతున్న అన్ని పార్టీలకు బుద్ధి వచ్చేలా తమ పార్టీ నాయకత్వం నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
