సోనియా తెలంగాణ హామీ పాతదే: తెరాస
న్యూఢిల్లీ: నవ తెలంగాణ పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన హామీలో కొత్త దనమేదీ లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ అన్నారు. తాము సోనియాగాంధీని దాదాపు రెండు డజన్ల సార్లు కలిశామని, తమతో చెప్పిన మాటనే సోనియా గాంధీ దేవేందర్ గౌడ్ కు చెప్పారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశం తమకు అత్యంత ప్రధానమైందని సోనియా ఎప్పుడూ చెబుతున్న మాటేనని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ పార్టీ సరిగా పని చేయలేదనే దేవేందర్ మాటలు నిజాలు కావని ఆయన అన్నారు. తాము 41 పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగి తెలంగాణకు మద్దతు కూడగట్టామని ఆయన చెప్పారు. ఢిల్లీలో తెలంగాణకు అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని దేవేందర్ గౌడ్ చెబుతున్నారని, అలా సానుకూలంగా వ్యవహరించడంలో తమ పార్టీ కృషి మాత్రమే ఉందని ఆయన అన్నారు. తమ శ్రమ ఫలితంగానే వాతావరణం తెలంగాణకు అనుకూలంగా మారిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications