విమర్శలు నన్ను తాకవు: చిరంజీవి
హైదరాబాద్: తనపై వస్తున్న విమర్శలు తనను తాకబోవని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. హైదరాబాదులోని మియాపూర్ లో ఆదివారం జరిగిన ప్రజారాజ్యం మహిళా సాధికారిత సదస్సులో ఆయన ప్రసంగించారు. తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని తాను పట్టించుకోవడం లేదని, వాటిని పట్టించుకుని జవాబు ఇచ్చే ప్రయత్నం వల్ల సమయం వృధా అవుతుందని ఆయన అన్నారు. అటువంటి విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయవద్దని ఆయన మహిళలకు సలహా ఇచ్చారు. తనలో నిజాయితీ, చిత్తుశుద్ధి ఉందని, వాటిని చూసే ప్రజారాజ్యం వైపు మహిళలు చూస్తున్నారని ఆయన అన్నారు.
ఇది పరీక్షా సమయమని, అద్భుతమైన అవకాశం వచ్చిందని, పథకం లేకుండా ముందుకు వచ్చామని, అయినా అన్నీ కలిసి వస్తున్నాయని, ఏదో అద్భుతమైన శక్తి వల్ల అలా కలిసివస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్త్రీ పక్షపాతి అని, తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక కూడా అందుకు అనుగుణంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎంతో మంది స్త్రీలు ప్రజారాజ్యంలోకి వస్తున్నారని, అవసరాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామని ఆయన చెప్పారు. పట్టపగలు కూడా స్త్రీలు బయటకు వెళ్లి క్షేమంగా ఇంటికి చేరుకోలని పరిస్థితులున్నాయని, అర్థరాత్రి స్త్రీలు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ అన్నారని, అంటే మనకు ఇంకా నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
