దొంగల బీభత్సం: భార్యాభర్తల హత్య
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం ఇంజాపూర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్యాభర్తలను హత్య చేసి నగలు దోచుకెళ్లారు. నల్లగొండ జిల్లా నడిగూడెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, రాజ్యలక్ష్మి దంపతులు ఇద్దరు పిల్లలతో ఇంజాపూర్ లో ఉంటున్నారు. దోపిడీ దొంగలు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు.
దోపిడీ దొంగలను ప్రతిఘటించడానికి శ్రీనివాస్ ప్రయత్నించాడు. అయితే దొంగలు ఇనుపరాడ్లు, కత్తిపీటతో శ్రీనివాస్ దంపతులపై దాడి చేశారు. ఉదయం పిల్లలు నిద్ర లేచే సరికి తల్లిదండ్రులు రక్తం మడుగులో పడి ఉన్నారు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పారు. దాంతో వారు వనస్థలిపురం పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్ కుటుంబం గత ఆరేళ్లుగా ఇక్కడ ఉంటున్నట్లు వనస్థలిపురం సిఐ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ చెప్పారు. దొంగలు నగలు, నగదు దోచుకెళ్లారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
