'అనంత' టిడిపికి హరికృష్ణ తలనొప్పి
హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విషయంలో నందమూరి హీరోల మధ్య విభేదాలు కొనసాగుతుండగానే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం ప్రారంభమైంది. పార్టీ పార్లమెంటు సభ్యుడు, స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అనంతపురం తెలుగుదేశం పార్టీలో ముసలానికి కారణమవుతున్నారు. స్వర్గీయ పరిటాల రవి వ్యతిరేకులను హరికృష్ణ ప్రోత్సహిస్తుండడంతో శాసనసభ్యురాలు పరిటాల సునీత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ధర్మవరం శాసనసభ్యురాలు జయమ్మ కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో వరదాపురం సూరిని హరికృష్ణ ప్రోత్సహిస్తున్నారని పరిటాల వర్గీయులు విమర్శిస్తున్నారు. అలాగే ధర్మవరం నియోజకవర్గంలో బాబు అనే వ్యక్తిని ప్రోత్సహించడం కూడా వారికి నచ్చటం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యాలయంలోని షరీఫ్ అనే వ్యక్తి కూడా పరిటాల రవి వ్యతిరేకులకు పెద్ద పీట వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
తమకు వ్యతిరేకంగా హరికృష్ణ పావులు కదుపుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పరిటాల సునీత స్తబ్దుగా ఉండిపోతున్నట్లు సమాచారం. జయమ్మ రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
